తాజా వార్తలు

10/recent/ticker-posts

ధాన్యం కొనుగోలుకు ఎకరాకు 115 గోనె సంచులు ఇవ్వాలి.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్..


ఉంగుటూరు( కైకరం) పశ్చిమ వాహిని, ఏప్రిల్ 18: రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతుకు 115వరకు గోనె సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉంగుటూరు మండలంలోని కైకరం, నారాయణపురం, చేబ్రోలు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కల్లాలోని ధాన్యాన్ని పరిశీలించారు. 

ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా 75 కేజీల చొప్పున ఎకరాకు 56 బస్తాలు కొనుగోలుకు 105 గోనె సంచులు ఇవ్వడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 60 బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతు పండించిన పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

అందుకు ఎకరా ధాన్యం కొనుగోలుకు 115 వరకు రైతుకు గోనె సంచులు ఇవ్వాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు వెంటనే పంపాలని డిమాండ్ చేశారు. చినిగిన గోనె సంచులు ఇస్తున్నారని,నాణ్యమైన గోన సంచులు ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గున్ను సూర్యరావు, చింతాడ నాగరాజు, అలికి పాపారావు పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.