కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్‌లో పేదలకు అల్పాహారం వడ్డించడం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయించడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అలాగే కొత్తూరు సెంటర్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించి, ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎస్‌జెఆర్ ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను సత్కరించడం కూడా కార్యక్రమంలో ముఖ్యాంశంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంత పోరాట యోధుడని, నిరంతర శ్రామికుడని, నిత్య విద్యార్థిగా ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల సేవలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



