తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక.. అనుమతులపై పునరాలోచన చేస్తాం


ఆంధ్రప్రదేశ్, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 27: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇంధన కొరత కారణంగా బంకులు మూతపడటం, ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.


ఇంధన సరఫరా డిమాండ్‌కు అనుగుణంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కంపెనీల అసమంజస నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే సహించబోమని హెచ్చరించారు. పెట్రోల్ బంకులకు క్రెడిట్ సదుపాయం నిలిపివేయడం వంటి చర్యలు సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చితంగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఆయిల్ కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని చంద్రబాబు గట్టి హెచ్చరిక చేశారు. వెంటనే సరఫరాను పెంచి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఆదేశించారు. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

పరిస్థితిని నియంత్రించేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులు, అధికారుల పర్యవేక్షణ పెంచడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన డీజిల్ సరఫరా కూడా నిరంతరంగా కొనసాగించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు.