ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి ప్రతి 15 రోజులకు పెరిగేలా పనితీరు మెరుగుపరచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాబోయే సమీక్షా సమావేశానికి ముందే కనీసం 10 శాతం సంతృప్తి స్థాయి పెరుగుదల కనపడాలని, లక్ష్యాలను చేరుకోని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంక్షేమ వసతి గృహాల పరిస్థితిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని హాస్టళ్లలో డైనింగ్, ఆర్.ఓ త్రాగునీరు, టాయిలెట్లు, సీసీ కెమెరాలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వార్డెన్ల బదిలీకి 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల డివిజినల్ స్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి సౌకర్యాలు పరిశీలించాలన్నారు.
రైతు సంక్షేమంపై మాట్లాడుతూ రబీ సీజన్‌లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాలువల ద్వారా సాగు, త్రాగునీటి సరఫరాను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని సమావేశం తీర్మానించింది.
అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బస్టాండ్‌లు, బస్టాప్‌ల వద్ద త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే, రోడ్ల మరమ్మత్తులు వేగంగా పూర్తి చేసి, కొత్త పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
పేదల గృహ నిర్మాణంలో అవకతవకలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. డబ్బులు తీసుకుని ఇళ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పనితీరులో వెనుకబడిన రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని రంగాల్లో సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.
శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జీలుగుమిల్లి లో బస్టాప్ ను తొలగించారని, పునర్నిర్మించాలని కోరారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాలు నిర్మాణం పూర్తిచేసుకున్న ప్రారంభించని కారణంగా ఇంకా వినియోగంలోనికి రాలేదని, కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్న కారణంగా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడిలో రోడ్లు అద్వాన్న పరిస్థితిలో ఉన్నాయని, మరమ్మట్లు చేయించాలని కోరారు. తెలంగాణా గ్రామాలలోకి వెళ్లే బస్సు సర్వీసులకు స్త్రీ శక్తీ పధకం వర్తించడంలేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు. చింతలపూడి పరిసర గ్రామాలకు మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటుచేయాలని కోరారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో గోదావరి కెనాల్ లో గుర్రపుడెక్క కారణంగా దెందులూరు నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలకు సాగు, త్రాగునీటి తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. దెందులూరు నియోజకవర్గంలో స్వంత స్థలం కలిగిన వారికి కూడా పేదల ఇళ్ల పధకంలో ఇల్లు మంజూరు చేసారన్నారు. పేదల ఇల్లు మంజూరైన వారు ఇల్లు నిర్మించుకోడానికి విముఖత చూపిస్తున్నారని, వారికి రద్దు చేసి, అర్హత కలిగిన వారికి మంజూరు చేయాలనీ కోరారు. దెందులూరు నియోజకవర్గంలో గతంలో మంజూరై చేపట్టిన రోడ్ల పనులు పూర్తి చేయలేదని, వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో రోడ్ల అద్వాన్న పరిస్థితిలో ఉన్నాయని, మరమ్మత్తులు చేయించాలన్నారు. ద్వారకాతిరుమలకు శని, ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయా రోజులలో ఆర్టీసీ అదనపు సర్వీసులు నడపాలని కోరారు. భీమడోలు స్టాండ్ అభివృద్ధి చేయవలసిందిగా కోరారు.
పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజన మండలాల్లోని వసతి గృహాలలో ఇటీవల డీఎస్సీ లో ఎంపికైన ఉపాధ్యాయులను వార్డెన్లుగా నియమించడంతో సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, వారిస్థానంలో సీనియర్స్ ని నియమించాలని కోరారు. బర్రింకలపాడు, బూసరాజుపల్లి గిరిజన వసతి గృహాలలో సరైన సౌకర్యాలు లేవని, కల్పించాలని కోరారు.
గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ద్వారకాతిరుమలకు శని, ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయా రోజులలో ఆర్టీసీ అదనపు సర్వీసులు నడపాలని కోరారు. ఆయా రోజులలో ద్వారకాతిరుమల బస్సు స్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున నియంత్రణకు సిబ్బంది నియమించాలని కోరారు.
సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐటిడిఏ పిఓ రాములు నాయక్, ఆర్డీఓ లు రమణ, దేవకీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు , ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎపి వడ్డిలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు.






.jpeg)

