ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: జిల్లాలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అదుపు చేయడానికి ఏటా రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిణామమని జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పోలీసింగ్ వ్యవస్థను ఆధునీకరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
దాతల సహకారంతో ఏలూరు జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు రూ.70 లక్షల వ్యయంతో 7 వాహనాలను ఒకేరోజు అందించడం చారిత్రాత్మకమని మంత్రి తెలిపారు. ఇందులో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో 6 వాహనాలు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సారథ్యంలో 1 వాహనం సమకూర్చడం స్ఫూర్తిదాయకమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సహకారంతో పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు.
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ఒకేరోజులో 7 వాహనాలను సమకూర్చడం ఆదర్శప్రాయమని అన్నారు. జిల్లా పరిపాలన, పోలీసు శాఖ సమన్వయంతో ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందని, కలెక్టర్ మరియు ఎస్పీ పనితీరును అభినందించారు. ఇటీవల జరిగిన దొంగతన కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితులను పట్టుకుని ఆస్తిని రికవరీ చేయడం ప్రశంసనీయం అని చెప్పారు.
ఏలూరు జిల్లాలో జాతీయ రహదారులు అధికంగా ఉండటంతో పెట్రోలింగ్ వాహనాల అవసరం పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని వాహనాలు అందేలా కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దాతల సహకారంతో ఇప్పటివరకు జిల్లాకు 19 వాహనాలు అందడం విశేషమని, ఇది దేశంలోనే ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.


