తాజా వార్తలు

10/recent/ticker-posts

రబీలో 23.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.. రైతులకు 24 గంటల్లో చెల్లింపులు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష అనంతరం రాష్ట్ర పౌర సరఫరాలు, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటనలు చేశారు. రానున్న రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 23.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 5.40 కోట్ల గోనెసంచులు, జిపిఎస్‌తో కూడిన 17 వేల లారీలు, 1241 మిల్లర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.


ధాన్యం అందించిన రైతులకు 8 నుండి 24 గంటలలోపే నగదు వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఈసారి కూడా లక్ష్య సాధనలో అధికారులు కృషి చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తిని దశలవారీగా 100 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణం, సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలను పెంచాలని సూచించారు.

2026-27 బడ్జెట్‌లో జిల్లాలోని వివిధ శాఖలకు రూ.4028 కోట్ల నిధులు కేటాయించామని, అందులో 60 శాతం గ్రామీణాభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 3.6 శాతం వృద్ధి సాధించామని, ఉద్యానవనాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఏలూరు జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పీఎన్‌జీ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, లక్ష కనెక్షన్లు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. పీఎన్‌జీ గ్యాస్‌కు కూడా దీపం పథకం కింద రూ.2900 సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో 9 వేల మంది వినియోగదారులు ఉండగా, మరిన్ని వేల కనెక్షన్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.