ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: మహిళలకు రక్షణతో పాటు కౌన్సిలింగ్ కేంద్రాలుగా మహిళా పోలీస్ స్టేషన్‌లు మారాలని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆశయాలకు అనుగుణంగా మహిళలకు సురక్షితమైన, ఆత్మీయ వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
మహిళా పోలీస్ స్టేషన్ భవన ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ గోడలపై చిత్రలేఖన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉత్సాహంగా పాల్గొని సామాజిక అంశాలను ప్రతిబింబించేలా చిత్రాలు వేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను పోలీస్ స్టేషన్‌లో చెప్పుకునేలా వాతావరణం కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. పోలీస్ స్టేషన్ అంటే భయం అనే భావన తొలగించి, ప్రజలకు స్నేహపూర్వకంగా అనిపించేలా ప్రాంగణాన్ని మార్చుతున్నామని చెప్పారు. అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం ఎలా పొందాలో, శక్తి యాప్ ఉపయోగాలపై గోడచిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో పాటు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ప్లే ఏరియా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రంగురంగుల బొమ్మలు, ఆట వస్తువులతో ఈ ప్రాంతం పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని చెప్పారు. అలాగే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ ప్రత్యేకంగా రూపకల్పన చేయగా, ఆమె సేవలను ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు. రవి చంద్ర, ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు తదితర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా భద్రత, సంక్షేమం దిశగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.



