తాజా వార్తలు

10/recent/ticker-posts

13 ఏళ్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మహా పాదయాత్ర – రోడ్డు, వంతెన కోసం ప్రజల గళమెత్తింపు


ఏలూరు జిల్లా, టీ. నర్సాపురం మండలం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 18: ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలంలో రోడ్డు, వంతెన కోసం ప్రజా సంఘాలు భారీ స్థాయిలో మహా పాదయాత్ర చేపట్టాయి. తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని మధ్యాహ్నపువారిగూడెం నుండి సాలిగూడెం, మల్లప్పగూడెం, అప్పలరాజుగూడెం వరకు సుమారు 6 కిలోమీటర్ల రహదారి మరియు వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 13 ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ఇక మౌనం వీడి తమ హక్కుల కోసం రోడ్డెక్కారు.


“మా ఓట్లు కావాలి.. మా కష్టాలు తీర్చరా?” అంటూ రైతులు, కార్మికులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో చిన్నారులు కూడా పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. బడికి వెళ్లాలన్నా, ఆసుపత్రికి చేరాలన్నా ఎదురయ్యే ఇబ్బందులను వారు తమ నిరసన ద్వారా వ్యక్తం చేశారు.

గ్రామాల్లో వంతెన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కాలువలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు వైద్యసేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికులు ప్రాణాల మీదకు తెచ్చుకుని కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ సర్పంచ్ యెల్లిన వెంకటరత్నం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాధనాల నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని, అప్పట్లో మంజూరైన నిధులు ఎక్కడికి వెళ్లాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వంతెన నిర్మాణం చేపట్టకపోతే ప్రజల ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ. రవి మాట్లాడుతూ, వెంటనే వంతెన పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను ఇకపై నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ పాదయాత్రలో కాంగ్రెస్, వామపక్ష, ఇతర ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, కార్మికులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ప్రభుత్వం స్పందించి రహదారి, వంతెన నిర్మాణం చేపట్టే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ప్రజల గోడు వినిపిస్తుందా లేక మరో పెద్ద ఉద్యమానికి దారి తీస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.