తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరులో మహిళల భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు – శక్తి టీమ్స్ సేవలపై చైతన్యం


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 18: మహిళలు మరియు చిన్నారుల భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఏలూరులో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఉమెన్ పోలీస్ స్టేషన్ సి.ఐ. సుబ్బారావు, వన్ టౌన్ సి.ఐ. సత్యనారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జేపీ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరై ఆసక్తిగా వినిపించారు.


ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారుల రక్షణ కోసం చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

పోలీసు సిబ్బంది మహిళలపై జరుగుతున్న వేధింపులు, గృహ హింస వంటి నేరాల నుండి రక్షణ పొందేందుకు ఉన్న చట్టాల గురించి వివరించారు. ఆపద సమయంలో శక్తి టీమ్స్ మరియు డయల్ 112 సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం జిల్లాలో శక్తి టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.

చిన్నారుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పోక్సో (POCSO) చట్టంపై అవగాహన కల్పించారు. పిల్లలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ మధ్య తేడాలను అర్థమయ్యేలా వివరించారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలతో నిరంతరం సంభాషణ కొనసాగించాలని సూచించారు.

సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని కూడా పోలీసులు వివరించారు. వ్యక్తిగత సమాచారాన్ని అనవసరంగా పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 గురించి ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ బి. నాగబాబు, వన్ టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, మహిళా ఎస్‌ఐ బి. నాగమణి, శక్తి టీమ్స్ సిబ్బంది మరియు దాదాపు 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా మహిళల్లో భద్రతపై అవగాహన మరింత పెరిగిందని అధికారులు తెలిపారు.