దెందులూరు (పోతునూరు), పశ్చిమ వాహిని, ఏప్రిల్, 11: రైతుల హక్కులను పరిరక్షించడం, వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం అఖిల భారత కిసాన్ సభ నిరంతరం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ తెలిపారు.
శుక్రవారం దెందులూరు మండలం పోతునూరులో రైతు ఉద్యమ అమరవీరుడు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి నివాసం వద్ద అఖిల భారత కిసాన్ సభ (ఎ.ఐ.కె.ఎస్) 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించి, అమరవీరుడు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, 1936 ఏప్రిల్ 11న స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ దేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. జమీందారీ విధానం రద్దు కోసం రైతాంగం చేసిన పోరాటాలు చారిత్రాత్మకమని తెలిపారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయ విధానాలను అమలు చేయడం వల్ల రైతులు తమ హక్కులను కోల్పోతున్నారని విమర్శించారు. రైతులు మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ ఉద్యమం ఫలితంగా ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ల ప్రైవేటీకరణ, కొత్త సహకార చట్టాల ద్వారా మళ్లీ అదే విధానాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతు వ్యతిరేక విధానాలపై రైతాంగం ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ, మద్దతు ధరలకు గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతు రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు, చల్లా బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.


