నిడమర్రు, పశ్చిమ వాహిని, మార్చి 15: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నిడమర్రు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నిడమర్రు ఇన్‌స్పెక్టర్ రజినీ కుమార్, ఎస్సై ఎస్.ఎం.వి.వి. రమేష్ గ్రామ కమిటీల సహకారంతో మండలంలో కీలక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
గత వారం రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన జాతరలు, ఉత్సవాల సందర్భంగా భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆలయ కమిటీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అత్యాధునిక Pan-Tilt-Zoom (PTZ) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టడంలో పోలీసులకు సహాయపడనున్నాయి.
శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయం తరపున ఒక PTZ కెమెరా, నాగులమిల్లి సెంటర్‌లో ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ గుడి వారు ఒక PTZ కెమెరా, అలాగే శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆలయం తరపున రెండు PTZ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను నాగులమిల్లి సెంటర్‌తో పాటు చాన్మిల్లి గ్రామ ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో అమర్చారు.
ఈ కెమెరాలను నిడమర్రు పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు ఎస్సై ఎస్.ఎం.వి.వి. రమేష్ తెలిపారు. జాతరలు, ఉత్సవాల సమయంలో జరిగే చైన్ స్నాచింగ్‌లు, జేబుదొంగతనాలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను ఈ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఈ PTZ కెమెరాలు 360 డిగ్రీల వరకు తిరుగుతూ సుదూర ప్రాంతాలను కూడా స్పష్టంగా జూమ్ చేసి చూపించగలవని, దీని ద్వారా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని పోలీసులు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరిస్తూ తమ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలను పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరూ ఇదే స్ఫూర్తితో నిఘా వ్యవస్థ ఏర్పాటుకు సహకరించి నేర రహిత మండలం గా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడమర్రు పోలీస్ సిబ్బంది మరియు ఆయా గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.



.jpeg)








