నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి 15: పట్టణంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పోలీసులు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ మరియు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్య శ్రీనివాస్, ఎస్సై నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి ఆదివారం పట్టణ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడం మరియు నేరాలను అరికట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి జరిమానాలు విధించకుండా, వారిచే అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి ధరించేలా టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్య శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడే ప్రధాన రక్షణ హెల్మెట్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
“వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచిస్తూ అతి వేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు వివరించారు. డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
తనిఖీల్లో భాగంగా మైనర్లు వాహనాలు నడపడం పట్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా స్పందించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేలా చేయవద్దని తల్లిదండ్రులకు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని వివరించారు.
అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగించి భారీ శబ్దాలతో ప్రజలను ఇబ్బంది పెట్టే వాహనాలను గుర్తించి వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. వాహనదారులు రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్య శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సురక్షిత ప్రయాణం ద్వారానే గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవచ్చని తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.



.jpeg)








