ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 15: రహదారి ప్రమాదాల నివారణకు మరియు వాహనదారుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఏలూరు రూరల్ పోలీసులు వినూత్నంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఆదివారం ఆశ్రమం హాస్పిటల్ సెంటర్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఏలూరు 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ నాగబాబు మరియు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించి జరిమానా విధించకుండా, సామాజిక బాధ్యతగా అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి ధరించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నాగబాబు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం ఆందోళనకరమని తెలిపారు. అతి వేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాహనాలు నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, నాణ్యమైన హెల్మెట్ ధరించడం ప్రతి వ్యక్తి తన కుటుంబానికి ఇచ్చే భరోసా అని పేర్కొన్నారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



.jpeg)








