ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: జాతీయ రహదారి NH-216 పై ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్.ఐలు జ్యోతి బాసు, లక్ష్మణ్ బాబు మరియు పోలీసు సిబ్బంది కలిసి నూజివీడు మండల పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు.
తుక్కులూరు, మోర్సపూడి, మీర్జాపురం, దేవరగుంట క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ప్రమాదాలకు అవకాశం ఉన్న నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద ఇసుకతో నిండిన డ్రమ్ములను ఏర్పాటు చేసి వాటిపై దూరం నుంచే కనిపించేలా రేడియం స్టిక్కర్లు అతికించారు. రాత్రి సమయంలో వాహనాల లైట్ల వెలుతురులో ఈ రేడియం స్టిక్కర్లు మెరిసి మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, కూడళ్లను ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయని పోలీసులు తెలిపారు.
అలాగే కూడళ్ల వద్ద వేగ పరిమితిని పాటించాలని, రాత్రి ప్రయాణాల్లో నిద్ర మత్తుగా అనిపిస్తే వాహనాన్ని సురక్షిత ప్రాంతంలో నిలిపి విశ్రాంతి తీసుకోవాలని, ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బంది కలగకుండా డిప్పర్లు ఉపయోగించాలని సూచించారు. ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పినా ఇసుకతో నిండిన డ్రమ్ములను ఢీకొంటే ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణనష్టం నివారించవచ్చని పోలీసులు తెలిపారు. కేవలం ఫైన్లు వేయడం పోలీసుల ఉద్దేశ్యం కాదని, ప్రతి వాహనదారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే లక్ష్యమని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.








