హనుమాన్ జంక్షన్, పశ్చిమ వాహిని, మార్చి 14: రహదారి ప్రమాదాలను తగ్గించి ఏలూరు జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో పెదవేగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్, పెదపాడు ఎస్‌ఐ ఆర్. శ్రీనివాస్ మరియు పోలీసు సిబ్బంది కలిసి శనివారం పాత జాతీయ రహదారిపై ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.
హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు వైపు వెళ్లే పాత నేషనల్ హైవే మార్గంలో అప్పనవీడు–తాళ్లమూడి గ్రామాల మధ్య ప్రమాదాలకు అవకాశం ఉన్న మలుపులు, కూడళ్ల వద్ద ఇసుకతో నింపిన డ్రమ్ములను ఏర్పాటు చేసి వాటిపై రాత్రివేళల్లో మెరిసే రేడియం స్టిక్కర్లను అతికించారు. ఇవి వాహనదారులకు ముందస్తు హెచ్చరికలుగా పనిచేసి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పోలీసులు తెలిపారు. అనంతరం కలపర్రు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించి, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి తలకు గాయాలు జరిగితే కలిగే ప్రమాదాలను వివరించారు.
హెల్మెట్ ధరించడం పోలీసుల కోసం కాదు, వాహనదారుల భద్రత కోసం మరియు వారి కుటుంబం కోసం అని సీఐ రాజశేఖర్ తెలిపారు. రాత్రి సమయంలో రేడియం స్టిక్కర్లు కనిపించే ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా ISI మార్క్ ఉన్న హెల్మెట్ ధరించాలని, మలుపుల వద్ద ఓవర్‌టేకింగ్ చేయకూడదని అధికారులు సూచించారు.








