పెదవేగి, పశ్చిమ వాహిని, మార్చి 14: నేర నియంత్రణతో పాటు గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని పెదవేగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పై పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమానికి పెదపాడు మండలం కొనికి గ్రామ ప్రజలు మంచి స్పందన చూపారు.
పోలీసుల విజ్ఞప్తికి స్పందించిన గ్రామ సర్పంచ్ పొట్లూరి యుగంధర్, గ్రామ నాయకులు గంప వంశీ, పిడుగు రామకృష్ణలు ముందుకు వచ్చి సుమారు రూ.1.20 లక్షల వ్యయంతో గ్రామ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో ఆరు ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామ ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ విగ్రహం వద్ద మరో కెమెరాను ఏర్పాటు చేసి నిరంతర నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సమాజ భద్రత కోసం చేసిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని అభినందిస్తూ సర్పంచ్ మరియు గ్రామ నాయకులను పెదవేగి సీఐ సిహెచ్. రాజశేఖర్, పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ సత్కరించారు.
సీసీ కెమెరాలు వంద మంది పోలీసులతో సమానమని, గ్రామాల భద్రత కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరరహిత సమాజం సాధ్యమవుతుందని సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామ భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పోలీసులకు మరియు గ్రామ సర్పంచ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.








