తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉపవాసం ద్వారా పేదల ఆకలి బాధ తెలుసుకుంటాం: ఎస్‌ఐఓ అధ్యక్షుడు సాజిద్ ఉల్లా


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 17: ఉపవాసం మనిషిలో దయ, దానం భావాలను పెంపొందించి పేదల ఆకలి బాధను అర్థం చేసుకునే ఆలోచన కలిగిస్తుందని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) ఏలూరు నగర అధ్యక్షుడుమహమ్మద్ సజిదుల్లా తెలిపారు.


రంజాన్ మాసం సందర్భంగా ఏలూరు తంగేళ్లముడిలోని శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్‌లో ఎస్‌ఐఓ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రంజాన్ నెల ఖురాన్ అవతరించిన పవిత్ర కాలమని, దానికి కృతజ్ఞతగా ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాసాలు ఉంటారని వివరించారు.

ఉపవాసం వల్ల శారీరక, మానసిక లాభాలు కలుగుతాయని, ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆకలి బాధను అనుభవించడం ద్వారా పేదల పరిస్థితి అర్థమై వారికి సహాయం చేయాలనే భావన కలుగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ కార్యకర్త షేక్ ఇలియాజ్ మాట్లాడుతూ జకాత్ విధానం గురించి వివరించారు. సంపాదనలో మిగులు ఉన్న వారు 2.5 శాతం పేదలకు పంచాలని, అది సాధ్యంకాకపోతే ప్రతి వ్యక్తికి కనీసం రెండున్నర కిలోల బియ్యం లేదా గోధుమలు పంచాలని సూచించారు.

ఇస్లాం ధర్మం తల్లిదండ్రులను సేవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం, పరమత సహనం పాటించడం, పొరుగువారి హక్కులను కాపాడడం వంటి విలువలను బోధిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జేఐహెచ్ కార్యకర్త సయ్యద్ మాలిక్, పాఠశాల ప్రిన్సిపాల్ డి. డానియల్, ఆఫీస్ ఇన్‌చార్జ్ లలిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.