ఏలూరు/దెందులూరు, పశ్చిమవాహిని,మార్చి 18: దెందులూరు మండలం సత్యనారాయణపురంలో బుధవారం "దివ్యాంగ శక్తి" దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం నుండి ఏలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో వరకు సాధారణ ఆర్టీసీ బస్సులో దివ్యాంగులుతో ప్రయాణం చేశారు. జిల్లా కలెక్టరు టికెట్టు ఇష్యూ మిషన్ నొక్కి జీరో బస్సు టికెట్లను స్వయంగా దివ్యాంగులకు అందజేశారు. జిల్లా కలెక్టరు స్వయంగా జీరో టికెట్సు ఇవ్వటంతో దివ్యాంగులు అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
దివ్యాంగులు కుటుంబ సభ్యులు ఆరోగ్య, తదితర వివరాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. మీ పిల్లలను బాగా చదివించుకుని ఐఏఎస్, ఐపియస్ ఉన్నత స్థాయీ చదువులు చదివించుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని అన్నారు. జిల్లా కలెక్టరుతో బస్సులో ప్రయాణం చేసే అవకాశం కలిగిందని ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని దివ్యాంగులు జిల్లా కలెక్టరుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టరుతో సెల్ఫీలు, గ్రూపు ఫోటోలు దిగారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ దివ్యాంగులు సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన "దివ్యాంగ శక్తి" పథకాన్ని దివ్యాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ఆర్థిక, సామాజిక పరమైన సహాయాన్ని అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. దివ్యాంగులు సమాజంలో సమాన అవకాశాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని తెలిపారు. ఈ పథకం వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి, బంధుమిత్రులు శుభ,తదితర కార్యక్రమాల్లో పాల్గొనుటకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చెయ్యవచ్చునని అన్నారు.
అలాగే దివ్యాంగులు తమ ప్రతిభను చాటుకునే వేదికలను సృష్టించడం, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు సాధికారతకు ప్రాధాన్యత నిస్తూ ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించడం లక్ష్యమని అన్నారు. సామాజిక, సమానత్వం కల్పించడం దివ్యాంగ శక్తి యొక్క ముఖ్యఉద్దేశ్యం అని తెలిపారు.
ఉచిత ప్రయాణం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఏపీఎస్ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. దివ్యాంగులు వెంట సహాయకునిగా ప్రయాణించే ఒక్కరికి బస్సు ఛార్జీలో 50 శాతం రాయితీ వర్తిస్తుంది తెలిపారు. దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందని, దివ్యాంగులు సమాజంలో ఎవ్వరికీ తీసిపోకుండా గౌరవంగా జీవించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి యస్ కె.షబ్నమ్, తహశీల్దారు బత్తుల సుమతి, ఆర్టీసీ పిఆర్వో కె.యల్.వి. నరసింహం, జిల్లా దివ్యాంగులు సంక్షేమ సంఘం (ఏడియస్ యస్) ప్రెసిడెంటు మామిడిపల్లి నాగభూషణం, జిల్లా దివ్యాంగులు ఎంప్లాయిస్ ప్రెసిడెంటు జి.డి.వి. యస్.వీరభద్రరావు, దివ్యాంగులు నాయకులు, ఆర్టీసీ బస్సు డ్రైవరు యం.రాజు, కండక్టరు జి.శ్రీనివాసు, దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
.jpg)


.jpeg)








