ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 17: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టీయూ అనుబంధ ఏలూరు పట్టణ జట్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వన్‌టౌన్ మెయిన్ బజార్ 7 గోలీల సెంటర్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర సహాయ కార్యదర్శి మంగమ అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కోడ్స్ అమలు చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 23న విజయవాడలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
1926 ట్రేడ్ యూనియన్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలు కార్మికుల ప్రాథమిక హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. చారిత్రాత్మక మేడే పోరాటాల ద్వారా సాధించిన 8 గంటల పని దినాన్ని తొలగించి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే వేతనాల లెక్కింపు విధానం, ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెంపు వంటి అంశాలను కూడా బలహీనపరుస్తున్నారని, పని ప్రదేశాల్లో కార్మిక భద్రతపై యజమానుల బాధ్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు వచ్చి విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అన్నవరం, ఈశ్వరరావు, గునుపూడి నాగేశ్వరరావు, బి. రామకృష్ణ, కే. మాణిక్యాలరావు, పెద్దిరాజు, రామ్మూర్తి, నూకరాజు, సత్తిబాబు, మాధవరావు, రాంబాబు, జగదీష్, కర్ణం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)








