తాజా వార్తలు

10/recent/ticker-posts

నేషనల్ పోలీస్ అకాడమీలో ఏఐపై ఏలూరు ఎస్పీ కీలక ప్రసంగం


హైదరాబాద్ పశ్చిమవాహిని, మార్చి 17: నేర పరిశోధన మరియు పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానించే దిశగా హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఉన్నత స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కీలక ప్రసంగం చేశారు.


నేర పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర, పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగంపై ఆయన సమగ్రంగా వివరించారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ అనుసంధానంలో తన అనుభవాన్ని పంచుకుంటూ, AI ద్వారా నేరాల విచారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని తెలిపారు.


అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎలా సమర్థంగా వినియోగించాలో వివరించారు. డేటా విశ్లేషణ ద్వారా నేరాలు జరగకముందే గుర్తించడం, డిజిటల్ సాక్ష్యాలను అధునాతన పరికరాల ద్వారా సేకరించడం ఎంత ముఖ్యమో ఆయన స్పష్టం చేశారు.

ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సీనియర్ పోలీస్ అధికారులతో పోలీసింగ్ టెక్నాలజీ అంశాలపై చర్చలు జరిపి, తన క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.

జాతీయ స్థాయి అకాడమీలో ఎస్పీ ప్రసంగించడం పట్ల ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. జిల్లా స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన సాంకేతిక మార్పులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.