జంగారెడ్డిగూడెం, పశ్చిమవాహిని, మార్చి 17: పట్టణ ఇలవేల్పు దేవత శ్రీ నుకలమ్మ అమ్మవారు వారి 62వ వార్షిక జాతర ఉగాది పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. జాతర మూడవ రోజైన మంగళవారం ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఉదయం భజన బృందాల ఆధ్వర్యంలో సామూహికంగా హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం నాలుగు గంటల నుంచి “సీతారామ కళ్యాణ గానామృతం” కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారికి నాలుగు మాడవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా భక్తులకు ధ్యానానుభూతి కలిగి, దుష్టశక్తులు తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, శుభాలు కలుగుతాయని తెలిపారు. అమ్మవారి సేవ ద్వారా మానసిక ప్రశాంతత, పాపపరిహారం లభిస్తాయని చెప్పారు.
జాతర నాలుగవ రోజు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి తాండ్రపాపారాయుడు సెంటర్ రామాలయం నుండి ప్రత్యేక సింహవాహన రథంపై అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళ వాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బాజాబజంత్రీలు, గరగాటాలు, కోలాటాలతో పట్టణ వీధుల గుండా ఉత్సవం జరుగనుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉగాది ఉత్సవాల నిర్వహణ, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాదాల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. గుళ్ళపూడి సీతారాంబాబు–లక్ష్మీభవాని దంపతులు, మానికల సూర్యారావు–పుష్పవతి దంపతులు నగదు విరాళాలు అందించగా, ఎర్రం ఉదయ్ కుమార్ కుటుంబం ప్రసాదాల కోసం 50 కిలోల బియ్యం సమర్పించారు. గుంటూరు నివాసి పొత్తూరు వరలక్ష్మి వెండి నేత్ర ద్వయాన్ని సమర్పించినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేసినట్లు ఆలయ మేనేజర్ తెలిపారు.




.jpeg)








