తాజా వార్తలు

10/recent/ticker-posts

నూజివీడులో ముమ్మరంగా ‘విజిబుల్ పోలీసింగ్’ – ప్రజల్లో భద్రతా అవగాహన పెంపు


నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 17: పట్టణంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నూజివీడు పోలీసులు ముమ్మరంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని చేపట్టారు. నూజివీడు డీఎస్పీ కె వి వి ఎన్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్య శ్రీనివాస్, ఎస్‌ఐ నాగేశ్వరరావు మరియు సిబ్బంది మంగళవారం పట్టణ పరిధిలో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.


ప్రజల్లో భద్రతా నమ్మకాన్ని పెంచడం, రహదారి నిబంధనలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై జరిమానా విధించకుండా, వారితోనే హెల్మెట్ కొనుగోలు చేయించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

“హెల్మెట్ ప్రాణ రక్షా కవచం – వేగం వద్దు, ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని టౌన్ ఇన్‌స్పెక్టర్ సూచించారు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడేది హెల్మెట్ మాత్రమేనని గుర్తుచేశారు. తనిఖీల్లో భాగంగా మైనర్లు వాహనాలు నడపడం పై పోలీసులు తీవ్రంగా స్పందించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హెచ్చరిస్తూ, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా వాహనాల్లో సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దం చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రతి వాహనదారుడు తన కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని గుర్తుంచుకుని సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రజల్లో భద్రతా నమ్మకం పెరిగిందని, నేరాల నివారణకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.