తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆగిరిపల్లిలో విజిబుల్ పోలీసింగ్… హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలి: ఎస్సై శుభశేఖర్


ఆగిరిపల్లి, పశ్చిమ వాహిని, మార్చి 15: ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు రహదారి ప్రమాదాలను నివారించేందుకు ఆగిరిపల్లి పోలీసు విభాగం విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించింది. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్సై శుభశేఖర్ తమ సిబ్బందితో కలిసి పోతవరపుపాడు గ్రామ పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.


ఈ సందర్భంగా ప్రజలకు రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై శుభశేఖర్ సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షణ పొందేందుకు హెల్మెట్ ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు.

అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపకూడదని హితవు పలికారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని పేర్కొన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలను కూడా ప్రజలకు వివరించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ విజిబుల్ పోలీసింగ్ మరియు అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతా అవగాహన పెరుగుతుందని, నేరాలను నివారించడంలో ఇది దోహదం చేస్తుందని ఎస్సై ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రయాణించే ప్రతి వాహనదారుడు తన కుటుంబ సభ్యులు తనపై ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్సై శుభశేఖర్ తెలిపారు. సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలను క్షేమంగా చేరుకోవాలని ఆయన వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.