తాజా వార్తలు

10/recent/ticker-posts

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ?... : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల


తెలంగాణ, పశ్చిమవాహిని, మార్చి 16: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్‌తో విందు చిందు చేస్తున్నాడు అని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం ? అని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది కదా...? ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారు ? అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు.


ఎంపీ పుట్టాపై చర్యలు తీసుకోవాలి
‘డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ?. యువత డ్రగ్స్ వాడాలని ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా?. ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఎంపీ పుట్టా మహేశ్ ఏం సమాధానం చెప్తారు?’అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు.ఎంపీ పదవి నుంచి పుట్టా మహేష్‌ను వెంటనే తొలగించాలి. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలి.డ్రగ్స్ పై నిజంగా ఉక్కుపాదం మోపితే ఎంపీపుట్టా మహేశ్‌పై చర్యలు తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు

మెుయినా బాద్‌లోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్టుగా పోలీసులు తొలుత తెలిపారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని వెల్లడించారు. మొత్తంగా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా నిర్దారణ అయిందని వెల్లడించారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన తర్వాత నిన్న రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్‌కు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే బ్లడ్‌ టెస్టులో పుట్టా మహేష్‌కు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. 

మెయినాబాద్‌లోని ఓ ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గురించి పక్కా సమాచారం రావడంతో... ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని, స్థానిక పోలీసుల సమన్వయంతో దాడులు చేసినట్టుగా తెలిపారు. అయితే తాము ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించే సమయంలో కాల్పుల శబ్దం వినిపించిందని... దీంతో మరింత వేగంగా స్పందించామని చెప్పారు. నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా గుర్తించామని తెలిపారు. దీంతో వెంటనే రివాల్వర్‌ను సీజ్ చేసి... అక్కడున్న 11 మందిని పక్కకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ కిట్‌‌తో టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయిందని పోలీసులు వెల్లడించారు.