తాజా వార్తలు

10/recent/ticker-posts

బెల్ట్ షాపులపై నియంత్రణ అవసరం – సిపిఎం నేత గుడెల్లి వెంకట్రావు విమర్శ


టీ. నర్సాపురం, పశ్చిమవాహిని, మార్చి 17: మండలంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు గుడెల్లి వెంకట రావు డిమాండ్ చేశారు.


మండలంలో ప్రధానంగా నాలుగు లైసెన్స్ బ్రాందీ షాపులు ఉన్నప్పటికీ, వాటికి అనుబంధంగా ప్రతి గ్రామంలో రెండు నుంచి పది వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం బెల్ట్ షాపులు నడిపితే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పినా, అధికారులు మాత్రం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కొన్ని బ్రాందీ షాపులు పగటిపూట లైసెన్స్ ప్రకారం పనిచేస్తూ, రాత్రి సమయంలో బెల్ట్ షాపులుగా మారుతున్నాయని తెలిపారు. ఒక క్వార్టర్ మద్యం ధర రూ.100–150 మధ్య ఉండాల్సినప్పటికీ, బెల్ట్ షాపుల్లో రూ.160 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా మద్యం వినియోగదారుల జేబులకు గండి కొడుతున్నారని అన్నారు.

బెల్ట్ షాపుల కారణంగా కష్టపడి సంపాదించిన డబ్బు మద్యం మీద ఖర్చై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అనేక కుటుంబాల్లో తండ్రి–కొడుకు తేడా లేకుండా మద్యం సేవించడం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వ అధికారులు మండలంలోని బెల్ట్ షాపులపై దృష్టి సారించి అక్రమంగా నడుస్తున్న షాపులను నియంత్రించాలని, లేకపోతే బాధిత కుటుంబాలతో కలిసి బెల్ట్ షాపులను మూయించే ఉద్యమం చేపడతామని గుడెల్లి వెంకట్రావు హెచ్చరించారు.