తాజా వార్తలు

10/recent/ticker-posts

నూకాలమ్మ అమ్మవారి ఉగాది జాతరలో వైభవంగా పంచామృత రుద్రాభిషేకం


జంగారెడ్డిగూడెం, పశ్చిమవాహిని, మార్చి 17: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత నూకలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్న 62వ వార్షిక జాతరలో భాగంగా రెండవ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.


ఉదయం గోపూజ అనంతరం నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కే.ఎల్.ఎన్. ధనకుమార్, టీడీపీ సీనియర్ నాయకుడు పెనుమర్తి రాంకుమార్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనకుమార్ మాట్లాడుతూ, సకల జీవరాసులకు జీవం, శక్తి, అభివృద్ధి కలిగించే పరమేశ్వరునికి అభిషేకం ద్వారా పంచామృత ద్రవ్యాలను సమర్పించడం భక్తుల కృతజ్ఞతా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు.

రాంకుమార్ మాట్లాడుతూ గతంలో అమ్మవారిని నమ్మి తమ పంటలు బాగా పండాలని మొక్కుకున్నప్పుడు అమ్మవారు కోరికలను తీర్చారని తెలిపారు. అమ్మవారిని నమ్మిన వారి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

సాయంత్రం అమ్మవారికి నాలుగు మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కండ్రికగూడెం షిర్డీ సాయిబాబా భజన మండలి సభ్యులు సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో భజనలు నిర్వహించారు.

ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రసాదాల తయారీకి సూర్య కాలేజీ వారు 100 కేజీల బియ్యం, వందనపు వెంకటేశ్వరరావు–సాయిబాల పద్మ దంపతులు 50 కేజీల బియ్యం సమర్పించారు. హర్ష హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ అట్లూరి హర్షవర్ధన్–డాక్టర్ సుంకవల్లి ప్రియాంక దంపతులు రూ.5,116, త్రినేత్ర హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ చవల నాగేంద్రబాబు–డాక్టర్ సమత దంపతులు రూ.5,116 విరాళంగా అందజేసినట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు.

మూడవ రోజు మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, ఎం. సీతారత్నం–శ్రీ వెంకట రామ పవన్ సాయి భజన బృందాల ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం సీతారామ కళ్యాణ గానామృతం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) భక్తులను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, పైల శ్రీను, జి.వి.కె.ఎస్ రాజు, హనుమంతరావు చౌదరి, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.