తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉత్సాహపూరిత వాతావరణంలో దివ్యాంగులతో కలెక్టరు సహపంక్తి భోజనం


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 18: ఏలూరు జిల్లా కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. "దివ్యాంగ శక్తి" పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన కలెక్టరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి నోటు బుక్కులను పంపిణీ చేశారు. కలెక్టరుతో కలిసి భోజనం చేసే అవకాశం లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సదరన్ క్యాంపులను క్రమం తప్పకుండా నిర్వహించి అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేసి, పథకాలు అందించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించి గౌరవప్రదమైన జీవితం గడిపేలా కృషి చేస్తామని కలెక్టరు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్, ఇతర అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.