తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – సీఈఓ సింహాచలం నాయుడు


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 17: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, తమతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓ సింహాచలం నాయుడు పిలుపునిచ్చారు.


మంగళవారం ఏలూరు జిల్లాలో ఈ పథకం కింద మంజూరైన యూనిట్లను పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.

ఈ సందర్భంగా వట్లూరులో రూ.30 లక్షల పెట్టుబడితో స్థాపించి 15 మందికి ఉపాధి కల్పిస్తున్న కోకాడ స్పోర్ట్స్ (రెడీమేడ్ గార్మెంట్స్) యూనిట్‌ను పరిశీలించారు. యూనిట్ ప్రొప్రైటర్ కాండ్రు సమన్విత రోజార్‌ను ఉత్పత్తి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్పోర్ట్స్ టీ-షర్ట్స్ తయారీ విధానం, ముడి సరుకుల సేకరణపై వివరాలు తెలుసుకున్నారు.

అలాగే సత్రంపాడులో రూ.9 లక్షలతో ఏర్పాటు చేసి ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న ప్రతిక్ డెంటల్ సర్వీస్ & టీత్ తయారీ యూనిట్‌ను సందర్శించారు. యూనిట్ ప్రొప్రైటర్ మత్స ప్రియాంక తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించి సూచనలు అందించారు.

ఇంకా ఏలూరు రామచంద్రావుపేటలోని సన్నీ డిజిటల్ యూనిట్ ప్రొప్రైటర్ నక్క చైతన్య నాయక్ యూనిట్‌తో పాటు, దెందులూరు సమీపంలోని సానిగూడెం వద్ద ఆలమంద చామంతి స్థాపించిన వేరుశెనగ డెకార్టికేటర్ యూనిట్‌ను కూడా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకటరావు, ఎఫ్‌ఏ & సీఏఓ ఎన్. రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ వి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.