తాజా వార్తలు

10/recent/ticker-posts

కైకలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు – జిల్లా కలెక్టర్


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 17: కైకలూరు నియోజకవర్గంలో నెలకొన్న 22ఏ భూ సమస్యలను సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు.


మంగళవారం భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్ల వారీగా సమగ్ర పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సమయంలో కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ఏలూరు జిల్లాలోకి చేరిందన్నారు. కైకలూరు పరిధిలోని ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో ఉన్న 22ఏ భూ సమస్యలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా రికార్డులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎస్‌కు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.