తాజా వార్తలు

10/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు – అక్రమ రవాణాపై కట్టడి


జంగారెడ్డిగూడెం పశ్చిమవాహిని, మార్చి 17: పట్టణంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘాను మరింత ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత ఆర్ పలు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్, ఎస్‌ఐ వీరప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ ట్రాన్స్‌పోర్ట్ యజమానులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రతి కార్యాలయంలో లోపల, బయట తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కనీసం 30 రోజుల పాటు రికార్డులు భద్రపరచాలని ఆదేశించారు.

అనుమానాస్పద పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, గంజాయి, మద్యం, నిషేధిత గుట్కా, బాణాసంచా వంటి అక్రమ వస్తువుల రవాణాకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వస్తువులు బుక్ చేసే వ్యక్తులు, స్వీకరించే వారి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల ప్రతులను తప్పనిసరిగా సేకరించాలని పేర్కొన్నారు.

ప్రతిరోజూ వచ్చే, వెళ్లే సరుకుల వివరాలు, వాహన నంబర్లు, డ్రైవర్ల వివరాలను స్పష్టంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ ముసుగులో ఎవరైనా అక్రమ రవాణాకు సహకరిస్తే లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లాభాలకే పరిమితం కాకుండా సమాజ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని యజమానులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా బల్క్ ఆర్డర్లు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

శాంతి భద్రతల పరిరక్షణలో వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని, ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.