తాజా వార్తలు

10/recent/ticker-posts

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ కొనియాడారు.


అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని సూచించారు. సమాజంలో ఐక్యత, సేవాభావం, నిస్వార్థ త్యాగం వంటి విలువలను ఆయన చూపిన మార్గంలో కొనసాగించాలని అన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, ఆంధ్రుల ఉనికిని జాతీయ స్థాయిలో చాటి చెప్పి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని తెలిపారు. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు సత్యం, అహింస, హరిజనోద్ధరణ వంటి ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సెట్‌వెల్ సీఈఓ ప్రభాకర్, సహాయ పర్యాటక అధికారి పట్టాభి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఆర్య వైశ్య సంఘ నాయకులు నంగులూరి సత్యనారాయణ, బ్రహ్మయ్య, గూడవల్లి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.