పెదవేగి/ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహనీయుడని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.
సోమవారం పెదవేగిలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న గొప్ప యోధుల్లో పొట్టి శ్రీరాములు ఒకరని తెలిపారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. ఆయన త్యాగం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు నిలిచారని అన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకోవాలని సూచించారు.
అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములును స్మరించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గారపాటి రామసీత, పెదవేగి సొసైటీ అధ్యక్షుడు తాతా సత్యనారాయణ, సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి, ప్రముఖులు బొప్పన సుధాకర్, ఈడుపుగంటి అనిల్ కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



.jpeg)








