తాజా వార్తలు

10/recent/ticker-posts

రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద రహదారి భద్రతపై అవగాహన – త్రీ టౌన్ పోలీసుల వినూత్న చర్యలు


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: రహదారి భద్రతపై యువతలో అవగాహన పెంచేందుకు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు.


త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్ఐ అప్పారావు మరియు పోలీసు సిబ్బంది కలిసిరామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు కేవలం జరిమానాలు విధించడం కాకుండా, అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి వారితో తక్షణమే హెల్మెట్లు కొనుగోలు చేయించారు.

పోలీసులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనంపై తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు. హెల్మెట్ అనేది పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమని స్పష్టం చేశారు.

ప్రతి వాహనదారుడి భద్రతపై ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకుని యువత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.

కేవలం చలాన్లు విధించడం మాత్రమే కాకుండా వాహనదారుల ప్రాణాల పట్ల శ్రద్ధ చూపుతూ అవగాహన కల్పించిన త్రీ టౌన్ పోలీసుల పనితీరును స్థానికులు, వాహనదారులు ప్రశంసించారు.