పెదవేగి/ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
సోమవారం పెదవేగిలోని పెదవేగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి పరీక్షా గదిని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 24,019 మంది విద్యార్థులు 133 పరీక్షా కేంద్రాలలో హాజరవుతున్నారని తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రంలోని హాల్స్‌లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్‌లు మరియు కేంద్ర పర్యవేక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సూచించారు.
పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు పూర్తయ్యే వరకు మూసివేయాలని ఆదేశించారు. అలాగే వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, పారిశుద్యం వంటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే 9491395377 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీ అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ విభాగాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్, ఎంపీడీఓ తదితర అధికారులు పాల్గొన్నారు.



.jpeg)








