తాజా వార్తలు

10/recent/ticker-posts

నేను ఎలాంటి తప్పు చేయలేదు...: డ్రగ్స్ కేసుపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 

ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా రాగా... అందులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు కావడంతో... ఆయన పోలీసు స్టేషన్‌ నుంచి విడుదలయ్యారు. అయితే ఈ వ్యవహారం నేపథ్యంలో పుట్టా మహేష్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పుట్టా మహేష్‌పై సీరియస్‌ అయ్యారు.

అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పుట్టా మహేష్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఎటువంటి తప్పు చేయనని చెప్పారు. తన స్నేహితుల ఆహ్వానం మేరకు ఫామ్‌హౌస్‌లో జరిగిన విందుకు మాత్రమే హాజరయ్యానని, ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడలేదని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.

ఏ విచారణనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహేష్ కుమార్ తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రజా జీవితంలో తాను ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తానని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఏలూరు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యాపించే పుకార్లు, తప్పుదారి పట్టించే పోస్ట్‌లను నమ్మవద్దని పార్టీ నాయకులు, మద్దతుదారులు, కార్యకర్తలకు మహేష్ విజ్ఞప్తి చేశారు.ఈ కేసులో నుంచి తాను బయటపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత నిజం గెలుస్తుందనే విశ్వాసం ఉందని తెలిపారు.

ఇక, పుట్టా మహేష్ కుమార్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించారు. పుట్టా మహేష్‌ కుమార్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానీయబోమని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మహేష్ కుమార్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. 

దీంతో మహేశ్‌కుమార్‌కు పల్లా శ్రీనివాసరావు నోటీసు జారీ చేశారు. మెయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో మార్చి 14న జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలు, మీడియాలో విస్తృతంగా వచ్చిన కథనాలను పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉన్నాయని పార్టీ భావిస్తోందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై 5 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.