కొయ్యలగూడెం, పశ్చిమవాహిని, మార్చి 09: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొయ్యలగూడెం మానవత మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణించిన మహిళలను గుర్తించి వారికి సన్మానం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవత మండల శాఖ అధ్యక్షుడు మందపాటి రామకృష్ణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కొయ్యలగూడెం పంచాయతీ ప్రధమ పౌరురాలు ముప్పిడి విజయకుమారి, పంచాయతీ ఈవో రుక్మిణి, ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత కుసుమ, మానవతా సెంట్రల్ కమిటీ సభ్యురాలు త్రిపురలను గుర్తించి వారికి చిరు సత్కారం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. జీవితంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను విద్యార్థులకు వివరించి, మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో మహిళల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోందని, భవిష్యత్తులో ప్రతి రంగంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా సభ్యుడు బొమ్మ మోహన్ రావు, మానవత వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ, సెక్రటరీ ఆగిరిపల్లి చంటి బాబు, ట్రెజరర్ చవ్వా రాము, టెలిఫోన్ శేఖర్, మానవత శాఖ సీనియర్ సభ్యులు ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, నిడదవోలు రామారావు, కంభంపాటి సాయి, అలాగే V.S.N కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








