ఏలూరు / విజయవాడ, పశ్చిమవాహిని, మార్చి 09: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. ఆయన మరణ వార్త రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆయన మచిలీపట్నం మరియు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి విశేష సేవలు అందించారు. ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
2013లో కేంద్ర ప్రభుత్వంలో టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి దేశానికి సేవ చేశారు. తన అనుభవం, దూరదృష్టితో రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.








