తాజా వార్తలు

10/recent/ticker-posts

ముసునూరు మండలంలో రాత్రివేళ దొంగల హడావిడి… జేసీబీ నుంచి సామగ్రి చోరీ


చెక్కపల్లి, పశ్చిమవాహిని, మార్చి 09: ముసునూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా చెక్కపల్లి గ్రామంలో జేసీబీ నుంచి సామగ్రి దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.


గ్రామానికి చెందిన మామిడి శెట్టి సత్యనారాయణకు చెందిన జేసీబీని డ్రైవర్ సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో వారి సొంత పొలంలో పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో పని నిమిత్తం వెళ్లి చూడగా జేసీబీ డోర్ తెరిచి ఉండటం గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పరిశీలించగా జేసీబీలో ఉన్న స్పీడోమీటర్ బోర్డు, స్విచ్‌లు, తాళం కిట్, టేపర్ కార్డ్ బాక్స్‌లు, రెంచీలు తదితర సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది. దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని తెలిపారు.

ఇది దొంగల పని లేదా ఎవరైనా శత్రుత్వంతో చేసిన పని అన్నది అనుమానంగా ఉందని యజమాని వాపోయారు. ఇటీవలి కాలంలో మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.