ద్వారకా తిరుమల, పశ్చిమవాహిని, మార్చి 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో భక్తురాలు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్‌ను పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి తిరిగి అందజేశారు. ఈ ఘటనలో పోలీసులు చూపిన అప్రమత్తతకు భక్తులు అభినందనలు తెలిపారు.
తాళ్లపూడి గ్రామానికి చెందిన కందుల మంగా దేవి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం కోసం ద్వారకా తిరుమలకు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న సమయంలో ఆమె చేతికి ఉన్న సుమారు 7 గ్రాముల బంగారు బ్రాస్లెట్ జారిపోయింది. ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆమె వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
భీమడోలు ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ పర్యవేక్షణలో ద్వారకా తిరుమల ఎస్.ఐ సుధీర్ మరియు సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. ఆలయ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానంతో బ్రాస్లెట్ ఎక్కడ పడిపోయిందో, ఎవరి వద్ద ఉందో గుర్తించారు.
పోలీసులు వెంటనే బ్రాస్లెట్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు పిలిపించి మంగా దేవి దంపతులకు సురక్షితంగా అందజేశారు. తమ పోగొట్టుకున్న నగ తిరిగి అందించడంతో మంగా దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు భక్తులకు సూచనలు చేస్తూ రద్దీ ప్రాంతాల్లో నగలు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
సకాలంలో స్పందించి భక్తులకు భరోసా కల్పించిన ద్వారకా తిరుమల పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.



.jpeg)








