తాజా వార్తలు

10/recent/ticker-posts

జిల్లా అభివృద్ధిపై సమీక్ష – ‘దివ్యాంగ శక్తి’ పథకం రేపు ప్రారంభం


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 17: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులతో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నిలిపేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలో మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే విధానాలు, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి పెంపు, పాపికొండల ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి, ముఖ్యంగా “టెంపుల్ టూరిజం సర్క్యూట్” ఏర్పాటు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అలాగే ప్రజల సంతృప్తి తక్కువగా ఉన్న ప్రభుత్వ సేవల విభాగాల్లో మెరుగుదల చర్యలు, రైతులకు సాగునీటి సౌకర్యాల కోసం పంటకాల్వల మరమ్మత్తులు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు తదితరులు, రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందలపు రవి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, కలెక్టరేట్‌కు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.

‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం రేపు
ఏలూరు జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని ఈనెల 18వ తేదీ ఉదయం 11:30 గంటలకు భీమడోలు మండలం సత్యనారాయణపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించనున్నారు. అనంతరం సత్యనారాయణపురం నుండి ఏలూరు వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు.

తదనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.