ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 17: జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
స్థానిక కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యానవన పంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపామని పేర్కొన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా ఐవిఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయి మరింత పెంచేందుకు, ప్రభుత్వ సేవలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీటి కనెక్షన్లు, పంచాయతీ & ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి, ఆర్టీసీ బస్టాండ్లు, అన్న కేంటీన్ల నిర్వహణ, పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలపై దృష్టి పెట్టామని వివరించారు.
రైతాంగానికి సాగునీటి సదుపాయాల కోసం కాల్వల మరమ్మత్తులు, నిర్వహణ చేపడుతున్నామని, అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలు, పాఠశాలలను పూర్తి చేస్తామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు భూములు గుర్తించడం, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు.
జిల్లాలో పర్యాటకాభివృద్ధికి “టెంపుల్ టూరిజం సర్క్యూట్” ఏర్పాటు చేస్తున్నామని, పాపికొండల ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి, ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. వైద్య సేవల మెరుగుదలకు ఆసుపత్రుల్లో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేస్తామని, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సేవల నాణ్యత పెంపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గ్యాస్ కొరత లేదు – పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. అవసరానికి మించి బుకింగ్‌లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ 6ఏ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు రేషన్ బియ్యాన్ని విక్రయించకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆహార పదార్థాల కల్తీలపై ఇప్పటికే ప్రధాన నగరాల్లో దాడులు నిర్వహించామని, ఖాళీగా ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో “సదరం” క్యాంపులు నిర్వహించి విభిన్న ప్రతిభావంతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు తదితరులు, రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందలపు రవి, వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి మరియు అధికారులు పాల్గొన్నారు.



.jpeg)








