తాజా వార్తలు

10/recent/ticker-posts

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు… వాహనదారులకు “ఫేస్ వాష్” కార్యక్రమం


పెదపాడు, పశ్చిమ వాహిని, మార్చి 15: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో మార్చి 14/15 తేదీల రాత్రి పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ముఖ్యంగా రహదారి ప్రమాదాలను తగ్గించడం, అక్రమ రవాణాను అరికట్టడం లక్ష్యంగా చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


తనిఖీల సందర్భంగా రాత్రి పూట మరియు తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లలో అలసట లేదా నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా “ఫేస్ వాష్ కార్యక్రమం” నిర్వహించారు. వాహనదారులకు ముఖం కడుక్కునేలా ఏర్పాట్లు చేసి, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో వాహనదారులకు వివరించి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ ప్రారంభించే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలని, అధిక వేగంతో వాహనాలు నడపకూడదని సూచించారు. అలాగే రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ఉపయోగించాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టపరమైన నేరమే కాకుండా ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. రాత్రివేళల్లో వాహన లైట్లను సరైన విధంగా వినియోగించాలని, అవసరమైనప్పుడు మాత్రమే హైబీమ్ లైట్లు ఉపయోగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని వాహనదారులకు సూచించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తి రక్షణ కోసం ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తుందని పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.