తాజా వార్తలు

10/recent/ticker-posts

పెదపాడు పోలీసుల మానవీయత… పేద కుటుంబానికి అండగా ఎస్సై ఆర్. శ్రీనివాస్


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 15: జిల్లా పెదపాడు మండలంలో పోలీసుల మానవీయత మరోసారి వెలుగులోకి వచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా ముందుండాలని భావిస్తున్న పెదపాడు పోలీసులు ఆపదలో ఉన్న ఒక పేద కుటుంబానికి సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు.


పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు (36) అనే వ్యక్తి గత కొంతకాలంగా పచ్చకామెర్లు వ్యాధితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడమే కాకుండా తీవ్ర పేదరికంలో ఉన్న ఆ కుటుంబం అంత్యక్రియల తర్వాత జరిగే దశదిన కార్యక్రమాలను కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంది.

ఈ విషయం గ్రామ పెద్దలు పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకొని మానవీయ కోణంలో స్పందించిన ఎస్సై, పోలీస్ స్టేషన్ తరఫున సహాయం అందించాలని నిర్ణయించారు.

దశదిన కార్యక్రమం నిర్వహించేందుకు పెదపాడు పోలీస్ స్టేషన్ తరఫున మొత్తం 75 కిలోల బరువు కలిగిన మూడు బియ్యం బస్తాలను మృతుని కుటుంబానికి అందజేశారు. పోలీసు అధికారి హోదాలో ఉన్నప్పటికీ తమ కష్టాన్ని గుర్తించి సొంత మనిషిలా ఆదుకున్న ఎస్సై ఆర్. శ్రీనివాస్‌కు మృతుని కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఖాకీ డ్రస్సులో ఉన్న మానవత్వాన్ని చూసి గ్రామస్తులు కూడా ఎస్సై శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.