తాజా వార్తలు

10/recent/ticker-posts

కైకలూరులో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – హెల్మెట్ లేని వారికి అక్కడికక్కడే కొనుగోలు చేయించిన పోలీసులు


కైకలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: కైకలూరు మండలం ఉప్పుటేరు సెంటర్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.


ఈ కార్యక్రమాన్ని కైకలూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ వి.రవికుమార్ ఆధ్వర్యంలో, రూరల్ ఎస్ఐ రాంబాబు సిబ్బందితో కలిసి నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానా విధించడం కాకుండా, అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి వారి భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం ఆందోళనకరమని తెలిపారు. కేవలం థ్రిల్ కోసం అతివేగంగా వాహనాలు నడపడం కుటుంబాలను కన్నీళ్లలో ముంచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అధికారులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా నాణ్యమైన (ISI) హెల్మెట్ ధరించాలని, నిర్ణీత వేగ పరిమితిని పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించకూడదని, వాహనానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. మీ కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని గుర్తుంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.