ద్వారకా తిరుమల, పశ్చిమ వాహిని, మార్చి 14: ద్వారకా తిరుమల మండలం ఎం. నాగులపల్లి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ పోలీసులు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ డ్రైవ్‌ను కృష్ణ ఆధ్వర్యంలో, సుధీర్ మరియు పోలీసు సిబ్బంది కలిసి నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించకుండా, 60 మంది వాహనదారులతో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి వినూత్నంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ “హెల్మెట్ భారం కాదు, అది మీ ప్రాణానికి రక్షణ కవచం” అని పేర్కొన్నారు. తలరాతను మార్చలేకపోయినా హెల్మెట్ ద్వారా ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని హెల్మెట్ ధరించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మరణాలు తలకు గాయాల వల్లే జరుగుతాయని, హెల్మెట్ ధరించడం వల్ల మెదడుకు గాయాల ప్రమాదం 70–80 శాతం వరకు తగ్గుతుందని వివరించారు. అలాగే గాలి, ధూళి, పురుగుల నుంచి కంటి రక్షణ కల్పించడంతో పాటు ఎండ, వాన, చలి నుంచి తలను కాపాడుతుందని తెలిపారు.
హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా ISI మార్క్ ఉన్నదో లేదో చూసుకోవాలని, పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. “మీ తల మీ కుటుంబానికి ఆస్తి, దానిని జాగ్రత్తగా చూసుకోండి” అని భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ తెలిపారు.








