ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 15: జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేకుండా సరఫరా కొనసాగుతున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడనుందంటూ కొన్ని నిరాధార వదంతులు ప్రచారం అవుతున్నాయని, ప్రజలు ఇటువంటి అవాస్తవాలను నమ్మి భయాందోళనలకు గురికావద్దని ఆయన సూచించారు.
జిల్లాలో గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరాను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల్లో గందరగోళం లేకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరులోని జిల్లా పౌరసరఫరాల అధికారి (DCSO) కార్యాలయంలో ప్రత్యేకంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. గ్యాస్ సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తినపుడు వినియోగదారులు వెంటనే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని చెప్పారు.
కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తుందని, గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైనా లేదా ఏజెన్సీల వద్ద ఇబ్బందులు ఎదురైనా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 7569296272 కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు.
ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని, జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతున్నదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.



.jpeg)








