తాజా వార్తలు

10/recent/ticker-posts

దివ్యాంగుల సేవలో ‘తదేకం ఫౌండేషన్’ అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్


నిడదవోలు, పశ్చిమవాహిని, మార్చి 09: సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే లక్ష్యంగా తదేకం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలులోని తన క్యాంప్ కార్యాలయంలో ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి గ్రీన్ రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులు కొప్పాక సీతారాంబాబు, మంత్రి ప్రగడదేవి, దాసరి శివలకు ట్రైసైకిల్స్ అందజేయగా, పిడుగు గోవిందరాజుకు ఎలక్ట్రికల్ స్కూటర్‌ను అందించారు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని సంతోషంగా జీవించాలని లబ్ధిదారులను మంత్రి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ సామాజిక బాధ్యతతో తదేకం ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ స్థానిక ఇన్‌చార్జ్ సుధా మరియు వారి బృందం నిడదవోలు నియోజకవర్గంలోని దివ్యాంగులకు సహకరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

అలాగే గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచిందని గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15,000 సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

తదేకం ఫౌండేషన్ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు కార్యక్రమాల్లో కూడా ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరినట్లు తెలిపారు. వచ్చే నెల నుంచి దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రారంభిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాగే చేతులు కలిపితే పేదలకు మరింత మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.