తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు మెరుగైన వైద్యసేవలు అందాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 15: ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వైద్య అధికారులకు ఆదేశించారు. ఆదివారం స్థానిక జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో హై-డిపెండెన్సీ యూనిట్, డెలివరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, గైనకాలజీ వార్డు, పోస్టు ఆపరేటివ్ వార్డు, బాలింతల వార్డు తదితర విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయానికి సేవలు అందిస్తున్నారా, మందులు సమయానికి ఇస్తున్నారా, ఆహారం సక్రమంగా అందిస్తున్నారా అని విచారించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు సంతృప్తికరంగా ఉన్నాయని రోగులు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించిన కలెక్టర్ అక్కడి కంప్యూటర్ డేటాను పరిశీలించి వివరాలను అధికారుల వద్ద నుంచి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి త్వరితగతిన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి అనవసర వివరాలు అడిగి సమయం వృథా చేయకుండా వెంటనే వైద్యసహాయం అందించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు మంచి వైద్యసేవలతో పాటు ఫ్రీ డెలివరీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, సిజేరియన్ ప్రసవాల శాతం తగ్గించే దిశగా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యసేవలపై ప్రజల్లో విశ్వాసం మరియు సంతృప్తి స్థాయి పెరగాలని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని చిరునవ్వుతో పలకరించి మర్యాదగా వైద్యసేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతను కచ్చితంగా పాటిస్తూ వార్డుల్లో బెడ్ షీట్లు తరచుగా మార్చేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గైనకాలజిస్టులు మరియు వైద్య సిబ్బందికి సూచించారు.

ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట ఇంచార్జి ఆర్‌ఎంఓ డా. బి. ప్రసాదు రెడ్డి, డా. కె.టి.యల్. హైమావతి, డా. యస్. హర్షవర్ధన్, తహశీల్దారు కె. గాయత్రీదేవి, ఏఎన్ఎంలు, వైద్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.