ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 15: జిల్లాలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర వయోజన విద్యా కార్యక్రమం ఫైనల్ పరీక్షలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక 23వ డివిజన్ ఫిరంగులదిబ్బలోని శ్రీ సాయీశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, పరీక్షల నిర్వహణ విధానాన్ని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయా, అభ్యాసకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 97,200 మంది వయోజన అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ఇందుకోసం 588 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణకు 2,117 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ప్రతి కేంద్రంలో పరీక్షలు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో అభ్యాసకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా తాగునీటి సదుపాయం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, సరిపడా కూర్చునే ఏర్పాట్లు, విద్యుత్ సదుపాయం వంటి అవసరాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే చికిత్స అందించేందుకు ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.
వయోజన విద్యా అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ కోరారు. అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకుని సమాజంలో మరింత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాలోని అభ్యాసకులు మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
అలాగే పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యాసకుడి హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు జి.సి.హెచ్. ప్రభాకర్, మెప్మా పీడీ ఎం. రాజబాబు, తహశీల్దారు కె. గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.



.jpeg)








