ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ పి. శ్రీనివాసులరెడ్డి బుధవారం ఏలూరులో నిర్వహించిన సమావేశంలో కనీస వేతనాల పెంపుదలపై యాజమాన్య సంఘాలు, కార్మిక సంఘాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఏలూరులోని హోటల్ అతిధిలో సంయుక్త కార్మిక కమిషనర్ ఎ. గణేశన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కార్మికుల వేతనాల పెంపునకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కూడా కనీస వేతనాల చట్టంలో పేర్కొన్న దానికంటే అధిక వేతనాలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం జారీ చేసే పెంపుదల ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు ప్రభుత్వ మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మండలిలో జాతీయ కార్మిక సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తే కార్మికులకు మరింత మెరుగైన వేతనాల నిర్ణయానికి అవకాశం ఉంటుందని సూచించారు.
ఈ సమావేశంలో మండలి సభ్యులు ఆర్. శ్యామ్, డి. పుల్లయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల ఉప కార్మిక కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఏలూరు సహాయ కార్మిక అధికారులు, వివిధ వర్తక వాణిజ్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



.jpeg)








